ముఖ పేజీ / కార్యక్రమాలు / విద్యా సేవలు – యువత అభివృద్ధి కార్యక్రమాలు

విద్యా సేవలు – యువత అభివృద్ధి కార్యక్రమాలు

74 ప్రభుత్వ పాఠశాలల్లో బడిసేవ, సాయంత్రం బడి, 2009 నుంచి ఉచిత Spoken English, పేద విద్యార్థులకు సహాయం.

అభిమాని ఫౌండేషన్ కార్యక్రమం ఫోటోఅభిమాని ఫౌండేషన్ కార్యక్రమం ఫోటోఅభిమాని ఫౌండేషన్ కార్యక్రమం ఫోటో

విద్యే వెలుగు... విద్యే భవిష్యత్తు... ప్రతి చిన్నారికి సమాన అవకాశమే మా లక్ష్యం...

ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, పేద మరియు గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి, ఆత్మవిశ్వాసం, ఉన్నత లక్ష్యాలను సాధించాలనే సంకల్పం పెంపొందించడం అభిమాని ఫౌండేషన్ ప్రధాన ఆశయాలలో ఒకటి.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు, వారిలో ప్రతిభను వెలికితీసి, సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసం, పోటీ తత్వం మరియు ఉన్నత స్థాయికి ఎదగాలనే స్ఫూర్తిని నింపేందుకు అనేక విద్యా సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.

మా విద్యా కార్యక్రమాలు

01బడి సేవ / గిరి సేవ – ప్రభుత్వ పాఠశాలల బలోపేతం

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించి, పాఠశాలలను విద్యకు అనుకూలమైన వాతావరణంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో బడిసేవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమం ద్వారా సుమారు 74 ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.

  • పాఠశాలలకు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా టేబుల్స్ అందించడం.
  • నేల ఫ్లోరింగ్, సీలింగ్ తదితర మౌలిక వసతుల మరమ్మతులు చేయించడం.
  • పాఠశాల వంటశాలలు (కిచెన్ షెడ్లు) మరమ్మతులు చేయించడం.
  • విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు వాటర్ ప్యూరిఫికేషన్ యంత్రాలు ఏర్పాటు చేయడం.
  • విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు పోటీ పరీక్షలు నిర్వహించడం.
  • సృజనాత్మకత, ఆలోచనా శక్తి మరియు విద్యా విలువలను పెంపొందించేందుకు సదస్సులు నిర్వహించడం.
  • విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం కోసం వివిధ పోటీలు, ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహించడం.

గిరిజన మరియు పేద కుటుంబాలకు చెందిన చిన్నారులు సైతం గౌరవంగా, సౌకర్యవంతంగా కూర్చొని విద్యను అభ్యసించాలనే ఆలోచనతో పాఠశాలల్లో అవసరమైన వసతులు కల్పించేందుకు కృషి చేయడం జరిగింది.

బడి సేవ / గిరి సేవ – ప్రభుత్వ పాఠశాలల బలోపేతంబడి సేవ / గిరి సేవ – ప్రభుత్వ పాఠశాలల బలోపేతంబడి సేవ / గిరి సేవ – ప్రభుత్వ పాఠశాలల బలోపేతంబడి సేవ / గిరి సేవ – ప్రభుత్వ పాఠశాలల బలోపేతం

02సాయంత్రం బడి – గ్రామీణ విద్యార్థులకు విద్యా సహకారం

గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులు చదువులో వెనుకబడకుండా, వారి విద్యా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సాయంత్రం బడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.

గ్రామాల్లో అందుబాటులో ఉన్న విద్యావంతులు, గ్రాడ్యుయేట్ల సహకారంతో విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక బోధనా తరగతులు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులకు చదువులో అదనపు సహకారం అందించడంతో పాటు, వారి సమయాన్ని విద్య, విజ్ఞానం, మంచి నడవడిక మరియు భవిష్యత్తు లక్ష్యాల వైపు మళ్లించడం జరిగింది.

03Spoken English & Personality Development

విజయనగరం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల్లో పేద యువతీ యువకులకు ఆంగ్ల భాషపై అవగాహన, మాట్లాడే నైపుణ్యం, ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిత్వ వికాసం కల్పించాలనే ఆశయంతో 2009 నుంచి ఉచిత Spoken English & Personality Development కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమాల ద్వారా వందలాది మంది యువతీ యువకులు శిక్షణ పొందారు.

గ్రామీణ ప్రాంత యువతలో భాషా నైపుణ్యాలు, కమ్యూనికేషన్ సామర్థ్యం, ఇంటర్వ్యూలను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు ఈ శిక్షణలు దోహదపడ్డాయి.

ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన పలువురు యువతీ యువకులు నేడు ఉన్నత స్థాయిలో ఎదిగి తమ జీవితాల్లో స్థిరపడడం అభిమాని ఫౌండేషన్‌కు గర్వకారణం.

Spoken English & Personality DevelopmentSpoken English & Personality DevelopmentSpoken English & Personality DevelopmentSpoken English & Personality Development

04పేద విద్యార్థుల దత్తత – విద్యకు అండ

ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యకు దూరమయ్యే పరిస్థితులు ఎదుర్కొంటున్న నిరుపేద విద్యార్థులను గుర్తించి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ విద్య కొనసాగించేందుకు అండగా నిలవడం జరిగింది.

పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి తోడ్పడుతూ, వారి కలలు సాకారం కావడానికి మరియు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.

05నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల చదువుకు అవసరమైన సందర్భాల్లో ఆర్థిక సహాయం అందించి, వారి విద్యాభ్యాసం నిరంతరంగా కొనసాగేందుకు సహకరించడం జరిగింది.

విద్య మధ్యలో ఆగిపోకూడదనే ఆశయంతో, ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తూ వారి భవిష్యత్తుకు తోడ్పడడం జరిగింది.

06మన కుటుంబం – వంశ వృక్షం (KNOW YOUR ROOTS – KNOW YOUR FAMILY)

మన మూలాలను తెలుసుకుందాం... మన కుటుంబ విలువలను గౌరవిద్దాం...
కుటుంబ బంధాలు... పూర్వీకుల త్యాగాలు...

నేటి విద్యార్థులు తమ కుటుంబ నేపథ్యం, పూర్వీకుల జీవితాలు, వారి త్యాగాలు, కుటుంబ బంధాల గొప్పతనాన్ని తెలుసుకోవాలనే ఆశయంతో అభిమాని ఫౌండేషన్ “మన కుటుంబం – వంశ వృక్షం” అనే కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో కుటుంబ వ్యవస్థపై అవగాహన పెంపొందించడం, తమ పూర్వీకుల గురించి తెలుసుకోవడం, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని మరింత బలపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాము.

  • 15,000 వంశ వృక్ష పోస్టల్ ఫారాల పంపిణీ. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 15,000 వంశ వృక్ష పోస్టల్ ఫారాలను విద్యార్థినీ విద్యార్థులకు అందించి, తమ కుటుంబంలోని ఐదు తరాల వివరాలను వాటిలో నమోదు చేయాలని కోరాము.
  • పెద్దల అనుభవాలు... పిల్లలకు జీవిత పాఠాలు. ఈ ఫారాలను నింపే సమయంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు మరియు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి జీవిత అనుభవాలు, కుటుంబ చరిత్ర, పూర్వీకుల కష్టాలు, త్యాగాలు, సాధించిన విజయాలు వంటి విషయాలను తెలుసుకునే అవకాశం కల్పించాము.
  • పెద్దలతో జరిగే ఈ సంభాషణలు విద్యార్థులకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పుతాయని, తమ కుటుంబ మూలాలను తెలుసుకోవడం ద్వారా వారిలో కుటుంబం పట్ల గౌరవం, బాధ్యత, కృతజ్ఞతా భావం మరియు జీవితంలో ముందుకు సాగాలనే దృఢ సంకల్పం పెరుగుతాయని ఆశించాము.
  • మన పూర్వీకుల జీవితమే మనకు పాఠం...మన కుటుంబ చరిత్రే మనకు ప్రేరణ...మన మూలాలను తెలుసుకోవడమే మన భవిష్యత్తుకు బలం...

అభిమాని ఫౌండేషన్ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా కుటుంబ విలువలను గుర్తు చేస్తూ, తరతరాల అనుబంధాన్ని బలోపేతం చేయడానికి ఒక చిన్న ప్రయత్నం చేశాము.

07సేవా కిరణం – ప్రేమానురాగాలకు దూరమైన చిన్నారుల జీవితాల్లో ఆశాకిరణం

ఒక ఆదివారం ప్రేమ... ఒక చిన్న పలకరింపు... ఒక ఆప్యాయత స్పర్శ...

చిన్నారుల జీవితాల్లో ప్రేమానురాగాల అవసరం

వసతి గృహాల్లో నివసిస్తూ విద్యనభ్యసిస్తున్న పేద, బడుగు, బలహీన వర్గాల చిన్నారులలో ఆత్మవిశ్వాసం, మనోధైర్యం నింపి, వారిలో సమాజంపై నమ్మకం పెంపొందించాలనే గొప్ప ఆశయంతో “సేవా కిరణం” కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.

పేదరికం కారణంగా తల్లిదండ్రులకు దూరంగా, వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న ఎంతోమంది చిన్నారులు కుటుంబంలోని ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకు దూరమవుతున్నారు. వారి మనసులు కూడా మిగతా పిల్లల మాదిరిగానే ప్రేమను కోరుకుంటాయి. ఎవరో తమను పలకరించాలని, తమతో సమయం గడపాలని, తమ కష్టసుఖాలను వినాలని, తమను ప్రేమగా చూసుకోవాలని ఆశిస్తుంటారు.

ప్రేమకు దూరమైన పిల్లలకు సమాజమే కుటుంబం

కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న పిల్లలను వారి తల్లిదండ్రులు ప్రతి వారాంతంలో కలుసుకుంటూ ప్రేమానురాగాలను పంచుకుంటారు. కానీ ప్రభుత్వ వసతి గృహాల్లో నివసించే పేద కుటుంబాల పిల్లలకు ఆ అవకాశం చాలామందికి ఉండదు. ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు, దూర ప్రాంతాల్లో నివాసం వంటి కారణాలతో వారి తల్లిదండ్రులు తరచూ వచ్చి పిల్లలను కలుసుకోలేకపోతుంటారు.

ఆ పిల్లల జీవితాల్లో ఏర్పడుతున్న ఈ ప్రేమాభావ లోటును గుర్తించి, సమాజంలో ఉన్న మనం వారికి ఆప్యాయతను పంచాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము.

ప్రతి ఆదివారం... వారికోసం మన సమయం

ప్రతి ఆదివారం పట్టణంలో నివసిస్తున్న మనం వసతి గృహాల్లోని చిన్నారులను కలుసుకోవాలి. వారితో కొంత సమయం గడపాలి. వారి అవసరాలను తెలుసుకోవాలి. వారికి అవసరమైన వస్తువులు అందించాలి. వారి మనసులోని మాటలను వినాలి. వారిలో ఒంటరితనాన్ని తొలగించి, “మీకు కుటుంబం దూరంగా ఉన్నా... మీకు అండగా నిలిచే సమాజం ఉంది. మీ కోసం ఆలోచించే మనుషులు ఉన్నారు. మీకు మేమున్నాము” అనే నమ్మకాన్ని కల్పించాలి.

ఈ చిన్న ప్రయత్నం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంపై గౌరవం, మనుషులపై నమ్మకం, తమ భవిష్యత్తుపై ఆశ కలుగుతుంది. తమకు అందుతున్న ప్రభుత్వ సౌకర్యాల పట్ల అవగాహన పెరిగి, వాటిని సద్వినియోగం చేసుకుంటూ మంచి పౌరులుగా ఎదగాలనే ఆలోచన వారిలో కలుగుతుంది.

వివక్షకు గురవుతున్నామనే భావనకు బదులుగా, సమాజం తమను ప్రేమిస్తోందనే భావన వారి హృదయాల్లో నాటుకోవాలి. వారు కూడా సమాజంలో సమానమైన గౌరవం, అవకాశాలు పొందాల్సిన పిల్లలేననే విషయాన్ని మన ప్రవర్తన ద్వారా తెలియజేయాలి.

సేవా కిరణం – మా సంకల్పం

చిన్నారులకు వస్తువులు అందించడం మాత్రమే మా సేవ కాదు. వారి హృదయాల్లో వెలుగును నింపడం, వారిలో మనోధైర్యాన్ని పెంపొందించడం, ఒంటరితనాన్ని తొలగించడం, సమాజం పట్ల ప్రేమ మరియు బాధ్యతను పెంచడం మా ప్రధాన సంకల్పం.

ఒక చిన్నారి మనసులో నమ్మకం కలిగితే, ఆ నమ్మకం అతని భవిష్యత్తుకు మార్గదర్శకమవుతుంది. ప్రేమతో పలకరించిన ఒక ఆదివారం, ఆ చిన్నారి జీవితంలో ఒక కొత్త ఆశకు ఆరంభం కావచ్చు.

మా సేవా ప్రయాణం (2012–2018)

2012 నుండి 2018 వరకు బొబ్బిలి మరియు సీతానగరం మండలాల్లోని ప్రభుత్వ వసతి గృహాల్లో “సేవా కిరణం” కార్యక్రమాన్ని నిర్వహించాము.

ఈ సేవా కార్యక్రమం ద్వారా వసతి గృహాల్లో నివసిస్తున్న చిన్నారులను తరచూ కలుసుకుంటూ, వారి అవసరాలను గుర్తిస్తూ, వారికి అవసరమైన సహాయం అందిస్తూ, వారిలో ఆప్యాయత, ఆత్మీయత, మనోధైర్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేశాము.

ఆ చిన్నారుల హృదయాల్లో “మా కోసం ఆలోచించే వారు ఉన్నారు... మమ్మల్ని ప్రేమించే వారు ఉన్నారు... మాకు అండగా నిలిచే వారు ఉన్నారు... మేము ఒంటరివాళ్లం కాదు... మాకు సమాజం ఉంది” అనే నమ్మకాన్ని కలిగించగలిగాము.

ఒక చిన్న పలకరింపు... ఒక పెద్ద మార్పు...

పిల్లలకు మనం అందించే సహాయం కంటే, వారితో మనం గడిపే సమయం విలువైనది. మన ప్రేమ, మన పలకరింపు, మన ఆప్యాయత వారికి జీవితంపై ఆశను కలిగిస్తాయి.

సేవా కిరణం... చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రేమ కిరణం.

మానవ సేవే మాధవ సేవ... ప్రతి చిన్నారి హృదయంలో ఆశను వెలిగిద్దాం.

మా సేవా ప్రభావం

74ప్రభుత్వ పాఠశాలలుబడిసేవ ద్వారా విద్యా మరియు మౌలిక వసతుల అభివృద్ధికి సహకారం
2009నుంచిపేద యువతకు ఉచిత Spoken English & Personality Development శిక్షణ
వందలాదిమంది యువతభాషా నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాస శిక్షణ ద్వారా ప్రయోజనం పొందిన వారు
విద్యార్థులదత్తత & ఆర్థిక సహాయంనిరుపేద విద్యార్థుల విద్యాభ్యాసానికి అండగా నిలిచిన సేవ
మా విద్యా ఆశయం
ప్రతి చిన్నారికి విద్య అందాలి... ప్రతి విద్యార్థికి తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం రావాలి... పేదరికం కారణంగా ఏ విద్యార్థి తన కలలను వదులుకోకూడదు...

గ్రామీణ ప్రాంత విద్యార్థుల నుంచి యువత వరకు ప్రతి ఒక్కరిలో జ్ఞానం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సృజనాత్మకత మరియు ఉన్నత లక్ష్యాలను సాధించాలనే సంకల్పాన్ని పెంపొందించడం అభిమాని ఫౌండేషన్ విద్యా సేవల ప్రధాన ఆశయం.

ఒక చిన్నారికి విద్య అందిస్తే... ఒక కుటుంబానికి భవిష్యత్తు అందించినట్లే.
విద్య ద్వారా వెలుగు... యువత ద్వారా మార్పు... సమాజ సేవ ద్వారా అభివృద్ధి...